"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

19 July, 2015

ముస్లిం సాహిత్య వాదానికి ఒక బలమైన అభివ్యక్తి 'స్కైబాబా'

-డా. దార్ల వెంకటేశ్వరరావు
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలుగుశాఖ,
 సెంట్రల్‌ యూనివర్సిటి, హైదరాబాద్‌-500 046,

             (సెంటర్‌ ఫర్‌ కంపారిటివ్‌ లిటరేచర్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ మరియు ఇండస్‌ పబ్లికేషన్స్‌ అండ్‌ స్కైబాబా మిత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘Exploring Texts & Works of Skybaaba’’ అనే అంశంపై సెంట్రల్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌ ఆడిటోరియంలో  రెండు రోజుల (27-28, ఆగస్టు, 2015) పాటు జరిగిన జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించాను. దీనిలో ప్రారంభంలోను, ముగింపులోను మాట్లాడిన, మాట్లాడాలనుకున్న భావాలను మీకు అందిస్తున్నాను.) 
*** 
            తెలుగులో ముస్లిం సాహిత్య వాదాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చిన వారిలో ఎస్‌.కె.యూసఫ్‌ బాబా (స్కై బాబా') ప్రముఖుడు. మనం సమకాలీన సాహిత్యం గురించి చదువుకుంటున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సాహిత్యంలో ఒక ప్రధాన ధోరణికి కారణమైన రచయితలను విద్యార్థినీ విద్యార్థులకు పరిచయం చేసే విధంగా ఈ సదస్సుని రూపకల్పన చేసిన సెంటర్‌ ఫర్‌ కంపారిటివ్‌ లిటరేచర్‌, ఇండస్‌ పబ్లికేషన్స్‌ అండ్‌ స్కైబాబా మిత్రులను అభినందిస్తున్నాను. ఈ సమావేశానికి నన్ను అధ్యక్షత వహించమనడాన్ని నాకిచ్చిన గౌరవంగా భావిస్తున్నాను.
            సాహిత్యం సమాజానికి ప్రతిబింబమంటుంటారు. నిజంగా ఇంతవరకూ అలా జరిగిందా అని లోతుగా పరిశీలిస్తే అది సమాజంలోని కొన్ని వర్గాల గురించి మాత్రమే ప్రతిబింబితమయ్యిందని తెలుస్తుంది. దీనిక్కారణాలనేకం ఉన్నాయి.  సాహిత్యమనేది  చాలారోజుల వరకూ కొంతమంది సొత్తుగానే  పరిగణింపబడింది. వాళ్ళు రాసిందే సాహిత్యంగా, వాళ్ళు చెప్పిందే సాహిత్యమయ్యింది. శాస్త్ర, సాంకేతికరంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు సాహిత్య పరిధుల్ని కూడా విస్తరిల్లేలా చేశాయి. సమాజంలో జరుగుతున్నదాన్ని ఆధిపత్య వర్గాలెంతగా ఆపాలని ప్రయత్నిస్తున్నా, కొన్ని నిజాలైనా బయటకొస్తున్నాయి. ఆ నిజాలు ఆలోచించేవాళ్ళని నిద్రలేకుండా చేస్తున్నాయి. అలా నిద్రలేనిరాత్రుల నుండి ఉవ్వెత్తుగా ఉరికిపడుతున్న సాహిత్యాన్నిప్పుడు మనం దళిత, ముస్లిం, తెలంగాణా సాహిత్యాలుగా పిలుచుకుంటున్నాం. అలా వచ్చిన వాటిలో తక్కువ సమయంలోనే ఎక్కువ చర్చలకు కారణమైన సాహిత్యం ముస్లిం సాహిత్యం. ఈ ముస్లిం సాహిత్యాన్ని రాస్తున్నవారిలో స్కైబాబాది బలమైన అభివ్యక్తి.
            సూటిగా, స్పష్టంగా, చెప్పాల్సిందేదో చెప్తూనే శాశ్వతమైన ముద్రవేసేలా అక్షరాల్ని సంధించే సాహిత్య విద్య తెలిసవాడు స్కైబాబా. తన జీవితం, తన చుట్టూ ఉండే సమాజం ఈ రచయితకింత స్ఫష్టతనిచ్చిందేమో అనిపిస్తుంది. తాను జర్నలిస్టుగా పనిచేయడం వల్ల కూడా జీవిత లోతుల్లోని చీకటి కోణాల్ని చూడగలిగే దష్టి ఏర్పడిందనుకుంటున్నాను. ఇవే వస్తువులై కవిత్వం, కథలుగా ఈయన కలం నుండి వెలువడ్డాయి.
            ముస్లిం సాహిత్యాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని అవగాహన చేసుకోవడానికి నేను  స్కైబాబాను ఎంతో నమ్మకంతో చదువుతాను. ఆచరణాత్మకమైన ఆలోచనలతో పాటు, సాహిత్యంలో ఉండాల్సిన సంవేదనలు ఈ సాహిత్యంలో కనిపించడమే నేను స్కైబాబాను అంతనమ్మకంగా చదవడానికి ఒక ప్రధాన కారణం. వ్యక్తిగా తన స్వీయానుభూతులను అందిస్తూనే, పీడితవర్గంగా ఉంటున్న ముస్లిములను వ్యవస్థీకతంగా పనిచేసేలా ప్రేరేపించడాన్ని ఈయన సాహిత్య కార్యాచరణలో గమనించాను. అందుకే ఈయన సాహిత్యాన్ని, జీవితాన్ని మూడు పాయలుగా అర్థం చేసుకోవచ్చనుకుంటున్నాను. వ్యక్తిగా స్కైబాబా చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల సమాజంలో వెంటనే స్పందించే గుణాన్ని అలవర్చుకున్నాడు. అందువల్లనే ఆ స్పందనని కవిత్వం, కథ, వ్యాసం, ప్రసంగం వంటి రూపాల్లో త్వరగా వ్యక్తీకరించేప్రయత్నం చేస్తాడు. అలాంటప్పుడు కొంతమందితో పేచీలకు కూడా గురవుతుంటాడు. శత్రు వర్గాన్ని కూడా తన చుట్టూ తానే తయారు చేసుకుంటున్నాడనిపిస్తుంది. హిందుత్వ వాదుల్నుండే కాకుండా తన ముస్లిం వర్గం నుండి కూడా ఈ శత్రుత్వం పెరుగుతుంటుంది. అదే అప్పుడప్పుడూ పత్రికల్లో స్కైబాబాని అంత తీవ్రంగా విమర్శించేలా చేస్తుందనుకుంటున్నాను.
            స్కైబాబా తాను స్పందించడమే కాకుండా తనకు తెలిసిన మార్గాలన్నింటినీ అన్వేషిస్తూ తన ఆలోచనలకు దగ్గరగా   ఉండేవాళ్లందరినీ ఒకేవేదికపైకి తెచ్చేందుకు కూడా క షిచేస్తాడు. కరపత్రం నుండి కవిత్వం, కథల వరకు తాను రాయడమే కాకుండా అలాంటి వాటిని రాయించేలా ప్రేరేపిస్తాడుబీ రాసిన వాటిని పుస్తకాలుగా తీసుకొస్తాడు. అన్ని పుస్తకాల్ని ప్రచురించడానికి తానేమీ ధనవంతుడు కాకపోయినా వాటిని ప్రచురించడానికి సహకరించే భావసారూప్యం గల వాళ్లని ఒప్పిస్తాడు. లేకపోతే 39 మంది కథకులతో 52 కథల ముస్లిం కథల సంకలనం 'వతన్‌' (2004) గానీ, 'అలావా' ముస్లిం సంస్క తి కవిత్వం (2006) వచ్చి ఉండేవే కాదు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన దిమ్మిస, జాగో జగావో మొదలైన పుస్తకాల్ని  సింగిడి ద్వారా కలెక్టివ్‌ వర్క్‌ గా తీసుకొచ్చాడు. వ్యక్తిగతంగా ఆయన తన కథల్ని 'ఆధూరె', బేచారె (2015) పేర్లతోను, కవిత్వాన్ని జగ్‌నే కీ రాత్‌  పేరుతోను ప్రచురించాడు. వీటితో పాటు మరికొన్ని రచనలు వచ్చాయి. వీటిని చూస్తే ఇంత చిన్నవయసులో అన్ని రచనలెలా చేశాడనీ, అన్ని గ్రంథాలనెలా ప్రచురించాడనీ అనుకుంటారు.  స్కైబాబా కవితలు పత్రికల్లో వచ్చినప్పుడే సంచలనం సష్టించాయి. ముస్లిం సాహిత్యంలో తప్పకుండా ప్రస్తావించాల్సిన కవితల్లో ఒక్క కవితాఖండికగానైనా స్కైబాబా కవితను తీసుకోవడమే ఈయన కవిత్వం తెలుగుసాహిత్యంలో కలిగించిన ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది.          

            ఇక, ఈయన మరికొంతమందితో కలిసిసంపాదకుడిగా తీసుకొచ్చిన 'ముల్కీ', 'జఖ్మీ ఆవాజ్‌' వ్యాస సంకలనాలు దళితులు, ముస్లిములు ఈ దేశంలో ఎదుర్కొంటున్న భావజాలపరమైన దాడులతో పాటు, భౌతిక దాడుల్ని కూడా వివరిస్తూ, భవిష్యత్తులో వీళ్ళుకలిసి పయనించాల్సిన అవసరాన్ని ఎలుగెత్తి చాటే గ్రంథాలు.  మూడో కోణంలో స్కైబాబాని చూస్తే సమకాలీన సమాజాన్ని, సాహిత్యాన్ని గుర్తిస్తూనే దార్శినిక స్వభావాన్ని కలిగుంటాడు. ఇక్కడున్న దార్శనికుడే నేడిక్కడ జాతీయ సదస్సుని నిర్వహించేలా ప్రేరేపించాడనుకుంటున్నాను. 

No comments: